బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (22:07 IST)

ఎన్టీఆర్ దుర్యోధన పాత్రే నటన వైపు వచ్చేలా చేసింది : రజనీకాంత్

rajini - balakrishna
"శ్రీకృష్ణ పాండవీయం" చిత్రం స్వర్గీయ ఎన్.టి.రామారావు పోషించిన దుర్యోధన పాత్రకు తాను మంత్రముగ్దుడిని అయ్యానని, ఆ పాత్రే తనను నటన వైపు వచ్చేలా చేసిందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. తాను బస్ కండక్టరుగా ఉన్న సమయంలో నిర్వహించిన ఓ వేడుకలో ఎన్టీఆర్‌ను ఊహించుకుని దుర్యోధన పాత్రను అభినయించా. అక్కడ దక్కిన ప్రశంస వల్లే నేను నటన వైపు వచ్చేలా చేసిందని ఆయన అన్నారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు శుక్రవారం రాత్రి జరిగాయి. 
 
ఇందులో రజనీకాంత్ పాల్గొని మాట్లాడుతూ, 'నేను తొలిసారిగా చూసిన సినిమా ఎన్టీఆర్‌ నటించిన 'పాతాళభైరవి'. ఆ చిత్రం నా మదిలో నిలిచిపోయింది. నా తొలి సినిమాలోనూ 'భైరవి ఇల్లు ఇదేనా?' అనే డైలాగ్ ఉంటుంది. సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా పనిచేస్తున్న రోజుల్లో ఓ దర్శకుడు నన్ను కలిసి హీరోగా సినిమా చేస్తానని చెప్పారు. కానీ, కథానాయకుడిగా నటించడం అప్పుడు ఇష్టం లేదు. 'ఒక్కసారి కథ వినండి' అంటూ సినిమా పేరు 'భైరవి' అని చెప్పారు. ఆ పేరు వినగానే చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాను. 
 
'లవకుశ' సినిమా విజయోత్సవ వేడుకకు ఎన్టీఆర్‌ చెన్నైకు రాగా దూరం నుంచి ఆయన్ను చూశా. అప్పుడు నా వయసు 13 ఏళ్లు. 'శ్రీకృష్ణ పాండవీయం' సినిమాలోని ఎన్టీఆర్‌ నటించిన దుర్యోధన పాత్రకు మంత్రముగ్దుణ్ని అయ్యా. నేను బస్‌ కండక్టర్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన ఓ వేడుకలో ఎన్టీఆర్‌ను ఊహించుకుంటూ దుర్యోధన పాత్రకు అభినయించా. అక్కడ దక్కిన ప్రశంసల వల్లే నేను నటన వైపు వచ్చాను. "దాన వీర శూర కర్ణ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానే నాకే గుర్తులేదని చెప్పారు. 
 
ఇకపోతే, నటసింహం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, 'కంటి చూపుతోనే ఆయన చంపేస్తాడు. ఆయన తన్నితే కారు 30 అడుగుల దూరంలో పడుతుంది. అలా.. రజనీకాంత్‌, షారుక్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌ ఎవరు చేసినా ప్రేక్షకులు అంగీకరించరు. ఎందుకంటే నందమూరి తారకరామారావుని బాలకృష్ణలో చూసుకుంటున్నారు. ఆయనకు కోపం బాగా ఎక్కువ. కానీ, మనసు వెన్నలాంటిది. సినీ, రాజకీయ జీవితంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా' అని ఆకాంక్షించారు.