కరోనా దెబ్బకు సిలబస్ తగ్గింపు - ఏపీ విద్యాశాఖ కసరత్తు
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా, దేశం చిన్నాభిన్నమైపోయింది. మరీముఖ్యంగా, విద్యాశాఖ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ వైరస్ పుణ్యమాన్ని అన్ని పరీక్షలు రద్దు చేశారు.
వాస్తవానికి అంతా సవ్యంగా ఉంటే ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఉండేది. కరోనా కారణంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కాలేదు. దీంతో, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
ఈ నేపథ్యంలో, ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 3 నుంచి వచ్చే ఏడాది మే రెండో వారం వరకు క్లాసులను నిర్వహించాలని సమాలోచనలు చేస్తోంది. క్లాసులు జరిగే రోజులు తగ్గుతుండటంతో... సిలబస్ ను 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు.
2021 మే తొలి వారంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా కేలండర్ సిద్ధం చేస్తున్నారు. మే రెండో వారం నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని భావిస్తున్నారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడులు తెరిచే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్న వేళ, రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించే దిశగా ఎటువంటి నిర్ణయమూ ఇప్పటివరకూ తీసుకోలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంలో ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్నీ వెలువరించలేదని, తాము కూడా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు ఎలాంటి అనుమతులూ లేవని అధికారులు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపైనా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే, పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని తన ఉత్తర్వులలో ఆమె స్పష్టం చేశారు.