మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (15:48 IST)

ప్రకాశం జిల్లాలో మూడు సెకన్ల పాటు కంపించిన భూమి

earthquake
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలను పసిగట్టిన ప్రజలు భయంతో తమ ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలకు ముందు భారీ శబ్దం వినిపించినట్టు స్థానికులు వెల్లడించారు. 
 
ఆదివారం ఉదయం జిల్లాలోని ముండ్లమూరు గ్రామంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే భూమి కంపించడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చామని వారు వివరించారు. ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 
 
కాగా, ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ యేడాది మార్చి నెలలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పలు గృహాల గోడలకు బీటలు వారాయి. వీధుల్లో వేసిన సిమెంట్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో తరచుగా ఈ భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.