శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (10:38 IST)

'పది' ఫలితాల్లో ఫెయిల్.. మనస్తాపంతో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య

suicide
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కొందరు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు అమ్మాయిలు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంటే, ఒక విద్యార్థి విషం, మరో విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
శ్రీ సత్యనాయి జిల్లా ఓబుళదేవర చెరువు మండలం, నవాబుకోటకు చెందిన వలిపి సుహాసిని (15) తాజాగా వెల్లడైన పది ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
 
అలాగే, అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన దినేష్ కుమార్ పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
అలాగే, ఇదే జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన శివకుమార్ తాడిపత్రిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదవగా, శనివారం వెల్లడైన ఫలితాల్లో 434 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. అయితే, తక్కువ మార్కులు రావడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తోటలోకి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానంతో వెళ్లిన తండ్రి గంగరాజుకు కుమారుడు అపస్మారక స్థితిలో పడివుండటాన్ని గమనించి వెంటనే తాడిపత్రి ఆస్పత్రికి తరలించాడు. 
 
కానీ, అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అదేవిధంగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతులదొడ్డి గ్రామానికి చెందిన కామాక్షి (16) అనే విద్యార్థిని గణింతంలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనలపై ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.