గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (15:45 IST)

వెంకటగిరి పోలీస్ స్టేషన్ మూసివేత - ఆంధ్రాలో 998 కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్‌ను కరోనా వైరస్ దెబ్బకు మూసివేశారు. 
 
ఈ స్టేషన్‌లో పనిచేసే దాదాపు అందరికీ కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. మొత్తం 11 మంది పోలీసులు, సిబ్బందికి వైరస్ సోకింది. ఓ హత్య కేసులో నిందితుల ద్వారా కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. వెంకటగిరి సీఐతోపాటు, ఎస్ఐ, ఏడుగురు పోలీసులకు, హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయింది. అలాగే స్వీపర్లకు వైరస్ సోకింది. దీంతో పోలీస్ స్టేషన్‌ను మూసివేసి వారందరినీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఐదుగురు మరణించగా, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 232కి పెరిగింది.
 
ఇకపోతే, తాజాగా 998 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 157, తూర్పు గోదావరి జిల్లాలో 118 మందికి కరోనా సోకింది. కొన్నిరోజుల కిందటి వరకు తక్కువ కేసులు వస్తున్న శ్రీకాకుళం జిల్లాలో తాజాగా 96 మంది కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 18,697 కేసులు నమోదయ్యాయి. తాజాగా 391 మంది డిశ్చార్జి కావడంతో ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,422కి చేరింది. ప్రస్తుతం 7,907 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 2,136 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.