కరోనా మందుల పేరుతో నమ్మించి... బాలికపై మైనర్ల అత్యాచారం
కరోనా మందులు ఇప్పిస్తామని ఓ బాలికను నమ్మించి.... తమ వెంట తీసుకెళ్లిన ఇద్దరు బాలురు... సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు కొవిడ్-19 పాజిటివ్ అని చెప్పి, ఈ వైరస్‌ను నయం చేయడానికి తాము సమీపంలోని ఆసుపత్రి నుంచి మందులు ఇప్పిస్తామని ఇద్దరు మైనర్ యువకులు నమ్మించారు. దీంతో ఆ బాలిక వారి మాటలు నమ్మింది. ఆ తర్వాత వారు ఆ బాలికను తమ వెంట నిర్మానుష్యం ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆ దుండగుల చెర నుంచి బయటపడిన ఆ బాలిక.. ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనను బయటకు తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు తనపై అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులకు చెప్పిందని, దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేర తాము పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నిందితుల్లో ఓ బాలుడిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో బాలుడు కోసం గాలిస్తున్నారు.