అది బీజేపీ సొల్లు సభ! సోమును ఎవరికైనా చూపించండి!!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సెటైర్లు వేశారు. విజయవాడలో బీజేపీ నిర్వహించింది ప్రజాగ్రహ సభ కాదు... బీజేపీ సొల్లు సభ అని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు ఈసారి కూడా బీజేపీ సోల్లే చెప్పారు తప్ప, అసలు విషయాలు మాట్లాడలేదన్నారు. సోము వీర్రాజును ఒకసారి మానసిక వైద్యుడికి చూపించాలని స్థానిక బీజేపీ నేతలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అస్సలు బీజేపీ ఏం న్యాయం చేసిందో చెప్పే దమ్ము సోము వీర్రాజుకు ఉందా? అని పద్మశ్రీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, అమరావతి రాజధానిని గాలికి వదిలేసిన బీజేపీ సొంత డబ్బా కొట్టుకోవడంలో మాత్రం ఫస్ట్ ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని పద్మశ్రీ ఎద్దేవా చేశారు. 7 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజధాని నిర్మాణానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకుందని, చివరికి 70 రూపాయలకి, 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు అనడం చూస్తే జాలేస్తోందన్నారు. అధికారం కోసం బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారతారని ప్రజలకు అర్థమైందన్నారు.
మద్యం తాగితే జీవితాలు పాడైపోతాయి అని ప్రజలకు చెప్పాల్సిన వ్యక్తి, తామే తక్కువ ధరకు ఇస్తాం తాగి నాశనమైపొండి అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే 70 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తాం అనే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా? అని సుంకర ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే, సోము వీర్రాజు ఏ కలుగులో దాక్కున్నారని అడిగారు. వెంకన్న సాక్షిగా మా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని సోము వీర్రాజు ప్రధాని మోదీని ప్రశ్నించాలని డిమాండు చేశారు. సోము వీర్రాజు ఉత్తరకుమార ప్రగల్భాలు కట్టిపెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సూచించారు.