బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (17:46 IST)

టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యా మంత్రి క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఆ రాష్ట్ర విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీఇచ్చారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో చ‌ర్చించామ‌ని.. ప్ర‌స్తుతం పరీక్షలను నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. 
 
అఖిల భారత స్థాయిలో పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా విద్యార్థులకు సమయం కావాల‌న్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్ర‌మే పరీక్షలు నిర్వహిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి భయం లేని సమయంలోనే పరీక్షలు ఉంటాయని తేల్చి చెప్పారు. 
 
ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక తండ్రిగా అయితే తాను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తాన‌ని మంత్రి చెప్పారు. ఆప్షన్స్ చూడకుండా ఎగ్జామ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. నారా లోకేష్ లాగా అందరూ దొడ్డిదారిలో మంత్రి పదవులు పొందలేరని ఆదిమూల‌పు సురేష్ మండిపడ్డారు. 
 
నారా లోకేష్ లాగా అందరికి హెరిటేజ్ లాంటి ఆస్తులు లేవని.. ఎవరో సీటు ఇప్పిస్తే ఆయ‌న‌ స్టాన్‌ఫోర్డ్‌లో చదివారని ఆరోపించారు. పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమిషం పట్టదన్నారు. కానీ, తనతో పాటు.. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచన చేస్తున్నామని తెలిపారు.