బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీ - టీఎస్‌కు వర్ష సూచన
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. దీంతో రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
వీటి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
మరోవైపు, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా, బెంగాల్‌లో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా ద్రోణి విస్తరించింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.