మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (18:49 IST)

ఏపీలో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ... మధ్యాహ్నం 2 గంటల వరకు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో శుక్రవారం నుంచి కర్ఫ్యూ సడలింపులిచ్చారు. రాష్ట్రంలో గురువారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇవ్వగా.. శుక్రవారం నుంచి ఈ సడలింపుల సమయాన్ని మరో రెండు గంటల పాటు ఏపీ ప్రభుత్వం పెంచింది. 
 
దీంతో రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు ఉండనుంది. ఈ నిబంధనలు జూన్ 20వ తేదీ వరకు అమలులో ఉంటాయని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ వెల్లడించారు. 
 
అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అటు 2 గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను అనిల్ సింఘాల్ ఆదేశించారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 97,863 శాంపిల్స్‌ పరీక్షించగా, 8,110 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఇప్పటివరకు 17,87,883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇందులో ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు తాజాగా 12,981 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడటంతో.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 16,77,063కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 67 మంది మృత్యువాతపడ్డారు.