సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (09:28 IST)

ఈ దఫాకు ఇక్కడే.. విశాఖలో కాదు.. క్లారిటీ ఇచ్చిన సర్కారు

ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను విశాఖపట్టణంలో నిర్వహించాని ప్రభుత్వం తొలుత భావించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా జిల్లా అధికారులకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. 
 
అయితే, మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుపై గవర్నర్ హరిచందన్ సంతకం చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు ఆమోదం వచ్చిన వెంటనే ఈ ఏడాది విశాఖలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని మొదట ప్రభుత్వం అనుకున్నది. 
 
కానీ, గవర్నర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ దఫాకు వేడుకలను విశాఖలోకాకుండా ఈ ఏడాది విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  
 
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యేడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 
 
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని, శకటాలను తీర్చిద్దిద్దాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.