వేట కుక్కలై వేటాడే సమయం దగ్గరపడే రోజు వస్తుందని జగన్‌గారూ : వైకాపా ఎంపీ
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అదే పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గట్టి హెచ్చరిక చేశారు. అమరావతిలో మహిళా రైతులు హైవేపై గాంధేయవాదంలో నిరసన తెలిపితే.. వారిని కుక్కలతో పోల్చారని, ఇది చాలా దారుణమన్నారు. 'ముఖ్యమంత్రిగారు వారు వేటకుక్కలై వేటాడే సమయం దగ్గరపడే రోజు వస్తుందని' అని అన్నారు.
ఏపీలోని సొంత పార్టీ నేతల నుంచి తనకు రక్షణ లేకుండా పోయిందనీ, అందువల్ల రక్షణ కల్పించాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిపట్ల కేంద్రం సానుకూలంగా స్పందించి వై కేటగిరీ భద్రతను కల్పించింది. దీంతో ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన మహిళా రైతులు అమరావతిలో హైవేపై గాంధేయవాదంలో నిరసన తెలిపారు. వారిని కొందరు కుక్కలతో పోల్చారు. ఇది చాలా దారుణమన్నారు.
'ముఖ్యమంత్రిగారు వారు వేటకుక్కలై వేటాడే సమయం దగ్గరపడే రోజు వస్తుందని' అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పోస్టింగులు పెట్టినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రాఘురామ కోరారు. రంగనాయకమ్మ అనే వృద్ధ మహిళ ఎవరో పెట్టిన పోస్టింగ్‌ను ఫార్వర్డ్ చేస్తే ఆమెపై కేసులు పెట్టినప్పుడు... ఇటువంటి వాళ్లపై కేసులు పెట్టకపోతే అపార్థం చేసుకోవాల్సి వస్తుందని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పైగా, కోట్లాది మంది ఇష్టదైవమైన శ్రీరాముడికి ఆలయం నిర్మించే భూమిపూజ కార్యక్రమాన్ని తితిదేకి చెందిన ఎస్వీబీసీ ఛానెల్‌లో రామమందిర శంకుస్థాపనను ప్రసారం చేయకపోవడం దారుణమన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. త్వరలో అమరావతిలో "మనోధైర్య" యాత్ర చేస్తానని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేకున్నా... అమరావతికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, అందువల్ల ఏ ఒక్కరూ అధైర్యపడొద్దన్నారు.