బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (08:32 IST)

ఏపీ సర్కార్‌ నూతన ఎక్సైజ్‌ పాలసీ

దశలవారిగా మద్యపాన నిషేధానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఏపీ సర్కార్‌ గురువారం నూతన ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించింది.

అక్టోబర్‌ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలు చేపట్టనుంది. కొత్త మద్యం పాలసీ విధానంలో 800 షాపులు తగ్గించింది. బెల్ట్‌ షాపులు ఎక్కడా కనిపించకుండా చర్యలు చేపట్టింది. ఇక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం భక్తుల మనోభావాలు దృష్ట్యా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గమధ్యలో మద్యం షాపులను నిషేధించింది.

అక్టోబర్‌ 1 నుంచి బేవరేజస్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోనే 3500 మద్యం షాపులను నిర్వహించనున్నారు. కాగా మద్యం మహమ్మారిపై గత టీడీపీ ప్రభుత్వానికి భిన్నంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని విడతల వారీగా నిషేధించేందుకు పూనుకున్నారు.

ప్రజారోగ్యానికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. అయితే మద్యం మాఫియాకు పూర్తిగా చెక్‌ పెట్టేందుకు ఏకంగా ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దు చేసేందుకు సంకల్పించారు.