సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (12:20 IST)

జగన్ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ : సిట్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ, లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్‌ ఏర్పాటుతో పాటు.. సిట్ తదుపరి కార్యకలాపాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 
 
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ... అన్ని పనులు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని భూములపై దర్యాప్తుకు సిట్‌న ఏర్పాటు చేయాలని సదరు సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా సిట్ విచారణను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 
 
అయితే, సిట్ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెదేపా నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక దురుద్దేశంతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతోందని తమ పిటిషన్‌లో వారు ఆరోపించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.