శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 23 నవంబరు 2021 (13:53 IST)

హైకోర్టు ముందు హాజరుకావాలని సిపి, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశం

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిప‌ల్ ఛైర్మన్ ఎన్నికలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని త‌మ పార్టీ కౌన్సిల‌ర్ల‌తో మున్సిప‌ల్ కార్యాల‌యంలో బైఠాయించ‌గా, ఇబ్రహింపట్నంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జోగి రమేశ్ మకాం వేశారు.


ఎన్నికలు జరగకుండా వైసీపీ కౌన్సిలర్ల విధ్వంసం, కుర్చీలు, బిల్లులు విరగ్గొట్టిన వైనంపై ఎంపీ కేశినేని నాని ఆధ్వ‌ర్యంలో టీడీపీ హైకోర్టులో కేసు వేసింది. రెండో రోజు కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ కార్యాల‌యానికి వ‌చ్చిన వైసీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్  వాకౌట్ చేశారు. దీనితో రెండో రోజు కూడా ఎన్నిక ఆపివేస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. దీనితో ఫైర్ అయిన ఎంపి కేశినేని నాని, త‌మ టీడీపీ కౌన్సిలర్లుతో మున్సిప‌ల్ హాలులోనే బైఠాయించారు.

 
ఎన్నిక నిలిపేస్తే అది తీవ్రమైన చర్యగా భావించాల్సి ఉంటుందని, రిటర్నింగ్ అధికారికి ఎంపీ కేశినేని నాని స్ప‌ష్టం చేశారు. అయితే, మ‌రో ప‌క్క హైకోర్టులో కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై వాడిగా, వేడిగా వాదనలు జ‌రుగుతున్నాయి. లంచ్ మోషన్ పిటిషన్ పై వాద‌న‌లు విన్న త‌ర్వాత‌, మున్సిపల్ కమిషనర్ ఎన్నిక వాయిదా అంశంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. నిన్న, ఈ రోజు వైసిపి నాయకులు విధ్వంసం సృష్టించారని ధర్మాసనం దృష్టికి లాయర్ అశ్విని కుమార్ తీసుకొచ్చారు.


దీనితో, ఈ మ‌ధ్యాహ్నం హైకోర్టు ముందు హాజరుకావాలని విజయవాడ సిపి శ్రీనివాసులుకు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొండ‌ప‌ల్లి ఎన్నిక‌ల్లో విధ్వంసంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.