శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (11:22 IST)

బెజ‌వాడ‌కు జాతీయ స్థాయిలో బెస్ట్ క్లీనెస్ట్ సిటీ అవార్డు

భారతదేశం గృహ నిర్మాణ, ప‌ట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి విజ‌య‌వాడ న‌గ‌రం అత్యుత్త‌మ అవార్డు అందుకుంది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ఫలితాలనూ, సఫాయిమిత్ర,  సురక్ష ఛాలెంజ్, స్టార్ రేటింగ్, చెత్త రహిత నగరాలు, ఓడిఎఫ్ సర్టిఫికేషన్‌లను భారత రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ప్రకటించారు. 
 
 
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కింద “ఉత్తమ పరిశుభ్ర నగరాల‌” కేటగిరీలో  భారతదేశంలోని అన్ని నగరాలలో విజయవాడ నగరం 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అవార్డును గౌరవ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్  చేతుల మీదగా నగర మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయితో కలిసి స్వీకరించారు. “చెత్త రహిత నగరం” కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నగరాల్లో విజయవాడ నగరం మాత్రమే చెత్త రహిత నగరంగా 5 స్టార్‌రేటింగ్ సాధించి అవార్డును సాధించింది. ఈ అవార్డును కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అందించారు.
                                                                                                                                                       

దేశంలోని 9 నగరాలలో విజయవాడ నగరం వాటర్ ప్లస్ సిటీ గా అవార్డు కైవసం చేసుకుంది. చెత్త సేకరణ విధానంలో వ్యర్థాలను తడి, పొడి మరియు ప్రమాదకర విభాగాలుగా విభజించడం, ఉత్పత్తి చేసిన తడి వ్యర్థాలకు వ్యతిరేకంగా ప్రాసెసింగ్ సామర్థ్యంలోనూ న‌గ‌రానికి ఈ గుర్తింపు ల‌భించింది. తడి, పొడి వ్యర్థాలను ప్రాసెస్ చేయడం, రీసైక్లింగ్ చేయడం, బిల్డింగ్ వ్య‌ర్థాల ప్రాసెసింగ్, ల్యాండ్ ఫిల్లింగ్, నగరాల పారిశుద్ధ్య స్థితి మొదలైన క్యాటగిరిలలో విజయవాడ నగరం ఈ అవార్డు సాధించింది. 
 
ఈ స్థితిని సాధించడంలో తమ సూచనలను, సలహాలను అందించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్  తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మహత్తర కార్యంలో పాలుపంచుకున్న పబ్లిక్ హెల్త్ వర్కర్లు, వార్డు శానిటేషన్ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, హెల్త్ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు మరియు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డులు సాధించడం విజయవాడ నగరానికి గర్వ కారణమని కమిషనర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధికారుల మరియు సిబ్బంది యొక్క సమిష్టి కృషి  ఫలితమే ఈ అవార్డులను  సాధించుట అనడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు. 
                                                                                                                                                       

విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో, నగర పౌరులు తమవంతు సంపూర్ణ సహకారం అందించి ఈ అవార్డులను సాధించడంలో వారి మద్దతు తెలిపారని, వారి సహకారం లేకుండా, ఈ స్థితిని సాధించడం సాధ్యం కాదనీ, అందుకు నగర పౌరులకు విజయవాడ నగర పాలక సంస్థ కృతజ్ఞతలు తెలుపుకుంటోందని అన్నారు.