ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (19:51 IST)

వి.ఐ.పి.ల కోసం సామాన్యులు విల‌విల‌, సీఎం రాక‌, బంద‌ర్ రోడ్డు బ్లాక్!

విజ‌య‌వాడ అంతా బ్లాక్ అయిపోయింది. ట్రాఫిక్ చ‌క్ర‌బంధంలో చిక్కుకుని న‌గ‌ర‌వాసులు గంట‌ల కొద్ది విల‌విల్లాడారు. శ‌నివారం సాయంత్రం బెజ‌వాడ‌లోని బంద‌రు రోడ్డు అంతా ట్రాఫిక్ తో చిక్కుముడి అయిపోయింది.
 
 
విజ‌య‌వాడ శివారులోని కానూరు సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఎమ్మెల్యే పార్థసారథి కుమారుడి వివాహం ఈ శ‌నివారం సాయంత్రం జ‌రుగుతోంది. ఈ వివాహానికి సీఎం జగన్ హాజ‌ర‌వ‌డంతో పోలీసులు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. సీఎం రాకకు ముందే బందరు రోడ్డును బ్లాక్ చేసిన పోలీసులు, గంట‌ల కొద్ది వాహ‌న‌దారుల‌ను నిలిపివేయ‌డంతో న‌గ‌రం అంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. 
 
 
గంట సేపటి నుంచి బెంజ్ సర్కిల్, పడమట, రింగ్ రోడ్డు ప్రాంతాల్లో  ట్రాఫిక్ నిలిచి పోయింది. చివ‌రికి న‌గ‌రంలోని అంతర్గత రోడ్డుల్లో సైతం వాహ‌నాలు నిలిచిపోయాయి. దీనితో వాహన‌దారులు తీవ్ర అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. విజ‌య‌వాడ వ‌న్ టౌన్ మొద‌లుకొని, ఫ్లైఓవ‌ర్, మొగ‌ల్ రాజ్ పురం, బంద‌రు రోడ్డు, బెంజ్ స‌ర్కిల్, ప‌ట‌మ‌ట‌తోపాటు కానూరు వ‌ర‌కు వాహ‌నాలు బారులుతీరి ఉన్నాయి. వి.ఐ.పి. ల రాక కోసం సామాన్యుల‌ను ఆపేయ‌డం భావ్యం కాద‌ని విజ‌య‌వాడ వాసులు తీవ్ర నిర‌స‌న తెలుపుతున్నారు.