1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (17:38 IST)

వ‌ర‌ద సహాయ పునరావాస కేంద్రాల‌ ఏర్పాటు... సీఎం స‌మీక్ష‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తీవ్ర వాయుగుండంతో కురిసిన భారీ వర్షాల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు పూర్తిగా ప్ర‌మాదంలో ప‌డ్డాయి. భారీ వర్షాలతో వరద ప్రభావిత ప్రాంతాలలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిమిత్తం సీఎం జ‌గ‌న్ శనివారం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.32గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
 
రాష్ట్ర ముఖ్యమంత్రికి కడప విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్ భాష,  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ప్రత్యేక అధికారి శశిభూషణ్ కుమార్, నగర మేయర్ సురేష్ బాబు, ఎస్పీ అన్బురాజన్, జేసి (అభివృద్ధి) సాయికాంత్ వర్మ,  ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, కడప రెవెన్యూ డివిజనల్ అధికారి ధర్మ చంద్ర రెడ్డి, అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గురుమోహన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ సంబతురు ప్రసాద్ రెడ్డి, డెప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి సాదరంగా ఆహ్వానం పలికారు.
 
 
రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరితలు కూడా గన్నవరం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రత్యేక విమానంలో వ‌చ్చారు. జిల్లాలో భారీ వర్షాలతో వరద ప్రభావానికి గురైన ప్రాంతాలు, చేపట్టిన సహాయక చర్యలు, జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం తదితరాలను ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్ భాష,  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ప్రత్యేక అధికారి శశిభూషణ్ కుమార్ లు రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు.

 
వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయ పునరావాసం కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు, త్రాగునీరు, ఆహారం,  అవసరమైన మందులు సరఫరా చేయాలని, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలని, జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం  వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి ఏరియల్ సర్వే నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్ర‌కృతి విల‌య‌తాండ‌వాన్ని స్వ‌యంగా ప‌రిశీలించారు.