1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (10:12 IST)

ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మకు కోటి దీపోత్సవం

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్టు దుర్గ గుడి ఆలయ స్థానాచార్యులు, గుడి ఈవో బ్రమరాంబ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి జీ అతిథిగా హాజరుకానున్నారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో 19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి ఆలయం చుట్టూ 8 కిలోమీటర్ల మేరకు గిరిప్రదక్షిణ ఉండనుందన్నారు. గిరి ప్రదక్షణకు రెండున్నర గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. 
 
గిరి ప్రదక్షిణలో దేవస్థాన ప్రచార రథంతో పాటు నడవలేని వారికి మినీ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రదక్షిణ చేసే భక్తుల కోసం మెడికల్ క్యాంపు, ఉచిత ప్రసాదం, ఆంబులెన్స్‌లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయనున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గిరి ప్రదర్శన చేయవలసిందిగా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
 
మరోవైపు, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి అమ్మవారి నిత్య అన్న ప్రసాద వితరణ పునఃప్రారంభమైంది. ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ మహా మండపం రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ విభాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవోలు భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాద వితరణలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది.
 
నిత్యం 2,500 మందికి, శుక్ర, ఆదివారాలలో 4,000 మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, పాలక మండలి సభ్యురాలు ఎన్‌.సుజాత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.