బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (20:37 IST)

నాబార్డు ఋణాల సద్వినియోగంలో ఏపీ అగ్రగామి.. నాబార్డు సిజియం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాబార్డు సహాయంతో ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్టులన్నింటినీ వచ్చే డిశంబరులోగా పనులు ప్రారంభించి మంజూరైన ఋణాలను సద్వినియోగం చేసుకునేందుకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.సెల్వరాజ్ సూచించారు.

బుధవారం అమరావతి సచివాలయం 5వ భవనంలో నాబార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఆర్ఐడిఎఫ్ (రూరల్ ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) కు సంబంధించి స్టేట్ లెవెల్ సెన్సిటైజేషన్ అండ్ ప్లానింగ్ పై నిర్వహించిన కార్యశాల (వర్కుషాపు)లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిజియం సెల్వరాజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాబార్డు నుండి సహాయం పొందడంలో దేశంలో మిగతా రాష్ట్రాలన్నింటి కంటే ముందుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నాబార్డు ద్వారా 10 వేల 250 కోట్ల రూ.లు విలువైన ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

నాబార్డు కేవలం 4.15శాతం వడ్డీకే ఋణాలను అందిస్తోందని ఇప్పటి వరకూ 69వేల ప్రాజెక్టులను మంజూరు చేశామని తెలిపారు. నాబార్డు ఆర్థిక సహాయం కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదిపాదనలను సకాలంలో నాబార్డుకు సమర్పించి డిశంబరు లోగా వాటిని గ్రౌండింగ్ చేసి ఋణాలను సద్వినియోగం చేసుకునేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హితవు చేశారు.

నాబార్డు వద్ద 2 వేల కోట్ల రూ.లు నిధులు సిద్దంగా ఉన్నాయని వాటిని సకాలంలో వినియోగించుకునేదుంకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో గత ఆరు మాసాల్లో నాబార్డు ఋణ సహాయంతో మంజూరు చేసిన వివిధ ప్రాజెక్టులు, పథకాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిజియం సెల్వరాజ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు విజ్ణప్తి చేశారు.

నాబార్డుకు మరో 4వేల కోట్ల రూ.లు విలువైన ప్రతిపాదనలు రావచ్చని అనుకుంటున్నామని అలాంటి ప్రతిపాదనలు సకాలంలో పంపాలని కోరారు. నాబార్డు ద్వారా ప్రస్తుతం 37 పథకాలకు సహాయం అందించడం జరుగుతోందన్నారు. లాంగ్ టెర్మ్ ఇరిగేషన్ ఫండ్ కింద పోలవరం ప్రాజెక్టుకు 6వేల 381కోట్ల రూ.లు ఋణం మంజూరు చేయగా ఇప్పటికే 5వేల 813 కోట్లు విడుదల చేయడం జరిగిందని చెప్పారు.

అలాగే గుండ్లకమ్మ, తాడిపూడి, తారకరామ, తీర్థసాగరం, పుష్కర ఎత్తిపోతల పథకాలకు 513 కోట్ల రూ.లు ఋణం మంజూరు చేయగా ఇప్పటికే 489కోట్లు విడుదల చేశామని తెలిపారు.వేర్ హౌస్ ఇన్ప్రాస్ట్రక్చర్ పంఢ్ కింద ఎపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 4లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కూడిన 45 గ్రామీణ గోదాముల నిర్మాణానికి ప్రతిపాదించగా అందుకై 228 కోట్ల రూ.లు ఋణం అందించాల్సి ఉండగా ఇప్పటికే 87కోట్లు రూ.లు విడుదల చేయగా మిగతా మొత్తాన్ని కూడా త్వరితగతిన విడుదల చేయనున్నట్టు సిజియం సెల్వరాజ్ చెప్పారు. 

నాబార్డు జనరల్ మేనేజర్ ప్రభార్ బెహ్రా మాట్లాడుతూ 2017-18 కేంద్ర బడ్జెట్లో డైరీ ప్రాసెసింగ్ అండ్ ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్  ఫండ్(డిఐడిఇ)పథకాన్ని ప్రకటించడం జరిగిందని దీని ద్వారా పాల ఉత్పత్తికి సంబంధించిన మౌళిక సదుపాయాల అభివృద్ధికి నాబార్డు ద్వారా సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.

ఇందుకై నాబార్డు వద్ద 10వేల 881కోట్ల రూ.లు నిధులు అందుబాటులో ఇప్పటికే 2వేల 485కోట్ల రూ.లు మంజూరు చేశామన్నారు. అలాగే 2018-19 కేంద్ర బడ్జెట్లో మత్స్య రంగ సంబంధిత మౌలిక సదుపాయాల ఆధునీకరణకై ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(ఎఫ్ఐడిఇ) అనే పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని దీని ద్వారా మెరైన్ ఆక్వాకల్చర్ మౌలిక సదుపాయాలను కల్పించడం, పోస్టు హార్వెస్టింగ్ నష్టాలను తగ్గించడం, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చేందుకు నాబార్డు తోడ్పాటును అందిస్తుందని చెప్పారు.

ఇందుకోసం నాబార్డు వద్ద 7వేల 522 కోట్ల రూ.లు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సహకార శాఖ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నాబార్డు ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సకాలంలో నాబార్డుకు పంపాలని ఆయా ప్రాజెక్టులు నిర్మాణంలో జాప్యం లేకుండా ఉండేందుకు ముందుగా భూమి గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు సూచించారు.

గ్రామీణ గోదాముల నిర్మాణానికి త్వరితగతిన ఋణం అందించాలని కోరారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ కమీషనర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఆర్ఐడిఎఫ్-24 కింద 723 అండగన్ వాడీ కేంద్రాల భవనాలు మంజూరు అయ్యాయని వాటికి సకాలంలో నిధులు మంజూరు చేయాలని కోరారు.

అంతకుముందు నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కళ్యాణ సుందరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాబార్డు నుండి ఏఏ ప్రాజెక్టులు, పథకాలకు సహాయం అందిస్తోంది వివరించారు. నాబార్డు ద్వారా 37 రకాల యాక్టివిటీలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు.

ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీరు, విద్య, వైద్యం, కనక్టెవిటీ, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, ఇతర మౌళిక సదుపాయాలు వంటి రంగాల్లో పెద్దఎత్తున సహాయం అందించడం జరుగుతోందని వివరించారు.పర్యావరణ పరిరక్షణతోపాటు సామాజిక అంశాలకు సంబంధించి 10 ప్రామాణికలును నాబార్డు పాటించడం జరుగుతోందని తెలిపారు.

నాబార్డు సహాయంతో మంజూరైన పాజెక్టులను 12నెలలులోగా గ్రౌండింగ్ చేపట్టాలని ఆ విధంగా చేసేలా నాబార్డు సంబంధిత శాఖలు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలతో నిరంతరం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.

ఇంకా నాబార్డు ద్వారా సహాయం అందిస్తున్న వివిధ ప్రాజెక్టుల గురించి వివరించారు. కార్యశాలలో నాబార్డుకు చెందిన మరో చీఫ్ జనరల్ మేనేజర్ కెఎస్.రఘుపతి, ఆర్అండ్ బి, పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమం, విద్య, వైద్య, నీటిపారుదల, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు విభాగాలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.