ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (14:45 IST)

మహిళతో మంత్రి ఆడియో కలకలం : వివరణ ఇచ్చిన అవంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో ఓ మహిళలో సరససల్లాపంగా మాట్లాడుతున్న ఆడియో ఒకటి లీకైంది. దీనిపై పెద్ద చర్చే సాగింది. ఇపుడు మరో ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తన మాట విని ఇంటికొస్తే అరగంటలో పంపించేస్తానని, వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ మహిళతో ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆ ఆడియోలో సంభాషణలు వున్నాయి. ఈ ఆడియో ఇపుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
దీంతో మంత్రి అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియో నకిలీదని తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే, తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎవరెవరో తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని అడుగుతుంటే బాధగా ఉందన్నారు. 
 
ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశానని, ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న తనపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు లేవని గుర్తు చేశారు. వైసీపీకి మహిళ్లలో విపరీతమైన ఆదరణ పెరుగుతోందన్నారు. తనను ఇబ్బంది పెట్టినవారు ఇబ్బంది పడక తప్పదని హెచ్చరించారు. 
 
ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి చెప్పారు. నిందితులు ఎవరన్నది త్వరలోనే తేలుతుందన్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరన్న మంత్రి.. తాను పార్టీలో గ్రూపులు నడపడం లేదని స్పష్టం చేశారు.