శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (15:01 IST)

చిరంజీవి - మోహన్ బాబు వంటి పెద్దలకు లేని దూల పవన్‌కు ఎందుకు : మంత్రి బొత్స

వైకాపా ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నోరుందికదాని ఇష్టానుసారంగా పారేసుకుంటే సహించబోమని హెచ్చరించారు.

ఆయన ఆదివారం విజయనగరంలో సిరిమాను ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 'సినిమా టికెట్ల అంశంలో జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలు సరికాదు. టికెట్ల ధరలు ఇష్టానుసారం పెంచేస్తామంటే కుదరదు. ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? జీఎస్టీ వంటి పన్నులను స్ట్రీమ్‌లైన్‌ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లే అడిగారు. నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.
 
చిత్ర పరిశ్రమలో పవన్‌తో పాటు చాలా మంది ఉన్నారు. చిరంజీవి, మోహన్‌బాబు వంటి పెద్దలు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ప్రభుత్వం మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు అదుపులో ఉండాలి' అని బొత్స హితవు పలికారు. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలోనూ ఆయన స్పందించారు. 'మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం ఇష్టం. మంత్రివర్గంపై పూర్తి స్వేచ్ఛ ఉంది. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే' అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.