గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 4 ఏప్రియల్ 2018 (21:26 IST)

యువ శాస్త్రవేత్త‌ల‌కు ఇదొక మంచి అవ‌కాశం: మంత్రి గంటా

అమ‌రావ‌తి : మారుతున్న స‌మాజానికి అనుగుణంగా అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల‌పై విద్యార్థులు అవ‌గాహ‌న‌ను పెంచుకోవాల‌ని, త‌ద్వారా ఆ రంగంలో రాణించాల‌ని రాష్ట్ర మానవ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆకాంక్షించారు. బుధ‌వారం ఆయ‌న విజ‌య‌వా

అమ‌రావ‌తి : మారుతున్న స‌మాజానికి అనుగుణంగా అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల‌పై విద్యార్థులు అవ‌గాహ‌న‌ను పెంచుకోవాల‌ని, త‌ద్వారా ఆ రంగంలో రాణించాల‌ని రాష్ట్ర మానవ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆకాంక్షించారు. బుధ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో జ‌పాన్‌లో జ‌రిగే స‌కురా యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థుల‌ను అభినందించారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీ రంగంలో అపార సాంకేతిక నైపుణ్యాన్ని క‌లిగి వున్న జ‌పాన్ దేశ సాంకేతిక ప్ర‌తిభ‌ను విద్యార్థులు త‌మ ప‌ర్య‌ట‌న‌లో గ్ర‌హించాల‌ని మంత్రి గంటా సూచించారు. 
 
టెక్నాల‌జీ ఏ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎదుగుద‌ల‌కైనా కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి రంగంలోనూ టెక్నాల‌జీ ఆవ‌శ్య‌క‌త పెరిగిపోయింద‌ని, టెక్నాల‌జీని ఔపోస‌న ప‌ట్ట‌డం ద్వారానే విద్యార్థుల‌కు మ‌రిన్ని అవ‌కాశాలు అంద‌డంతో పాటు దేశం మ‌రింత ముందుకెళ్ల‌గ‌ల‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఆసియాన్ దేశాల విద్యార్థులకు ప‌ర‌స్ప‌ర స‌మాచార మార్పిడికి స‌కురా యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్‌కు ఎంత‌గానో దోహ‌దం చేస్తుంద‌ని అన్నారు. 
 
యువ శాస్త్రవేత్త‌ల‌కు ఇదొక మంచి అవ‌కాశ‌మ‌ని మంత్రి గంటా అభివ‌ర్ణించారు. ఇంట‌ర్ చ‌దువుతున్న జి.అరుంధ‌తి (ఎబి బాల‌యోగి గురుకులం, వైజాగ్, ఎపి ఎస్‌డ‌బ్ల్యుఆర్ఈఐఎస్), టి.అనూష (ఎపి బాల‌యోగి గురుకులం, వంగ‌ర‌, ఎపి ఎస్డ‌బ్ల్యుఆర్ఈఐఎస్), ఎస్. జ‌న‌ప్రియ (ఎపిఎస్‌డ‌బ్ల్యుఆర్ఈఐఎస్, మ‌ల్లి శ్రీకాకుళం), కె. సాయి సందీప్ ( ప‌దోత‌ర‌గ‌తి, ఎపి నాగార్జున సాగ‌ర్, ఎపిఆర్ ఈఐఎస్), టి వంద‌న‌, (ఎపి ఎంఎస్ ఈదుల‌వ‌ల‌స‌) శ్రీకాకుళం, డి.హేమ‌ల‌త (ఎపిఎంఎస్, క్రోసూరు, గుంటూరు) ఈ స‌ద‌స్సుకు ఎంపిక‌య్యారు. వీరిని మంత్రి గంటా... ప్ర‌త్యేకంగా అభినందించి స్వీట్లు అందించారు. 
 
ఏప్రిల్ 8 నుంచి 13 వ‌ర‌కు విద్యార్థులు జ‌పాన్‌లో ప‌ర్య‌టించి వివిధ ప్ర‌దేశాల‌ను, సాంకేతిక‌త‌ల‌ను సంద‌ర్శిస్తారు. నోబ‌ెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత ప్రొఫెస‌ర్ ట‌కాకి క‌జితా ఉప‌న్యాసం కూడా షెడ్యూల్‌లో వుంది. స‌కురా యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్‌ని ప్ర‌ఖ్యాత జ‌పాన్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఏజెన్సీ(జె.ఎస్.టి) నిర్వ‌హిస్తోంది. ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచి ఇంగ్లీషు నైపుణ్యం, వ‌య‌స్సు ఇత‌ర అంశాల ప్రాతిప‌దిక‌న ఈ విద్యార్థుల‌ను ఎంపిక చేయడం జ‌రిగింది. ఆర్.ఎం.ఎస్.ఏ డైర‌క్ట‌ర్ పి.ప్ర‌భాక‌ర్ రావు, ఇత‌ర ఉన్న‌తాధికారులు స‌మావేశంలో పాల్గొన్నారు.