ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?
ఈ ఏడాది జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. టీడీపీ, బీజేపీలు ఒక్కో ఎంపీ సీటును దక్కించుకున్నాయి. దీంతో ఖాళీ అయిన మూడో సీటు కూడా టీడీపీకి దక్కుతుందని తెలుస్తోంది. ఆర్ఎస్ ఎన్నికలకు టిడిపి అభ్యర్థిగా బీద మస్తాన్ రావును ఖరారు చేయగా, బిజెపి ఆర్ కృష్ణయ్యను ఖరారు చేసింది.
వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు స్థానాల్లో.. ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది.. కేంద్ర ఎన్నికల సంఘం.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య వేర్వేరు కారణాలతో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ఏపీ కోటాలో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే.
అందువల్ల ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే, ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా? లేక భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా? అనేదానిపై చర్చ జరుగుతోంది.