బకాయిలు చెల్లిస్తేనే సీఎం కాన్వాయ్‌కు వాహనాలు : ఏపీ రవాణాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకునివుంది. దీనికి కారణం ఇష్టానుసారంగా అప్పులు చేసిన సంక్షేమ పథకాల రూపంలో పేదలకు పంచిపెడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇపుడు సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బకాయిలు చెల్లించకుంటే సీఎం కాన్వాయ్‌కు వాహనాలు సమకూర్చలేమంటూ ఆ రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ ఇపుడు సంచలనంగా మారింది.
సాధారణంగా సీఎం కాన్వాయ్‌తో పాటు ఇతర ప్రముఖుల కోసం రవాణా శాఖ వాహనాలను సమకూర్చుతుంది. ఈ వాహనాలకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. అయితే, రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లుగా ఈ అద్దె చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ.17.5 కోట్లకు చేరుకున్నాయి.
వీటికోసం తాజాగా ఏపీ రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆ లేఖలో కోరింది. అంతేకాకుండా తక్షణమే బకాయిలు చెల్లించకుంటే సీఎం సహా వీఐపీలకు ఇకపై కాన్వాయ్‌లను ఏర్పాటు చేయలేమంటూ రవాణా శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.