శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తీరం దాటిన అసని తుఫాను - భారీ వర్షాలు కురిసే అవకాశం

cyclone
భయోత్పాతం సృష్టించిన అసని తుఫాను ఎట్టకేలకు మచిలీపట్నం - నరసాపురం మధ్య తీరం దాటింది. ఈ తుఫాను బలహీనపడి తీరం దాటినప్పటికీ వచ్చే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు ముగ్గురు మరణించగా, 900 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అలాగే, అనేక విమాన సర్వీసులను నిలిపివేశారు. 
 
ఇదిలావుంటే, ఈ తుఫాను తీరం దాటినప్పటికీ గురువారం రాత్రికి ఉత్తర దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ తుఫాను కారణంగా విశాఖపట్టణం, శ్రీకాకుళం, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 900 ఎకరాల్లోని పంటకు నష్టం వాటిల్లినట్టు అంచనా. 
 
మరోవైపు, అసని తుఫాను తీవ్రవాయుగుండంగా మారినప్పటికీ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మత్స్యుకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.