మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (15:19 IST)

కడప అడ్డాలో ఆడబిడ్డకు అన్యాయం.. కనిపించని జ"గన్" : నారా లోకేశ్

nara lokesh
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అడ్డాగా పేర్కొనే కడప జిల్లాలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడంటూ చేసిన ప్రకటనలు ఏమయ్యాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో గిరిజిన బాలికపై పది మంది కామాంధులు అత్యాచారం చేసి గర్భవతిని చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. 
 
దీనిపై నారా లోకేశ్ మాట్లాడుతూ, "గన్ కంటే ముందొస్తాడని కోట్ల రూపాయల ప్రకటనలు ద్వారా ప్రచారం చేయించుకున్న జగన్ సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే ఏదా గన్? ఎక్కడా గన్? అంటూ ఆయన నిలదీశారు. 
 
అమాయక గిరిజన బాలికపై అత్యాచారం జరిగిన విషయం, ఆ బాలిక గర్భందాల్చిన విషయం నిజమేనని సాక్షాత్ మహిళా పోలీసులు నిర్ధారించినా పోలీసులు మాత్రం నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తుందని ఆయన ప్రశ్నించారు. 15 యేళ్లు కూడా నిండని బాలికను గర్భవతిని చేసిన నిందితులను కాపాడటమేనా మీ ఆడ బిడ్డలకి కల్పించే రక్షణా? అంటూ లోకేశ్ నిలదీశారు.