జగన్ అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే అరెస్టు : అచ్చెన్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తమ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణను అరెస్టు చేశారంటూ టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఏపీ పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణను మంగళవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ, సీఎం జగన్ తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ అరెస్టు చేశారన్నారు. ఈ మూడేళ్ళలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం మినహా జగన్ చేసిందేమి లేదన్నారు.
ఒక మాజీ మంత్రిని అరెస్టు చేసేముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడం సీఎం జగన్ సైకో ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. ప్రశ్నపత్రాలు లీకేజీ ఎక్కడా జరగలేదని సాక్షాత్తూ రాష్ట్ర విద్యా శాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చెబుతుంటే, మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నారాయణను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగైనే నారాయణను అరెస్టు చేసిందన్నారు.
ప్రజా పాలన అందించడంలోనే కాదు.. పరీక్షల నిర్వహణలోనూ విఫలమైన వైకాపా ప్రభుత్వం ఆ మచ్చను చెరిపేసుకునేందుకు నారాయణపై నెపం నెట్టేందుకు ఈ అరెస్టు చేసిందన్నారు. జగన్ పట్ల ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుందని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కిు తెరతీశారని, ప్రతి అరెస్టుకు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.