శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 3 డిశెంబరు 2019 (21:08 IST)

ఇకపై అమెజాన్‌లో ఆప్కో చేనేతలు: మంత్రి మేకపాటి గౌతం రెడ్డి

వెలగపూడి (సచివాలయం): ఎంతో ప్రసిధ్ది గాంచిన ఆంధ్రప్రదేశ్ ఆప్కో చేనేత వస్ర్తాలు అమెజాన్ ద్వారా దేశీయ విపణిలో విక్రయానికి సిద్దం అయ్యాయని ఐటి, పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. చేనేత వస్త్ర ప్రేమికులు ఇకపై ఆప్కో, అమెజాన్ సంస్ధల సంయిక్త భాగస్వామ్యం ద్వారా సులువుగా వీటిని పొందగలుగుతారని వివరించారు. అమెజాన్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆప్కో వస్త్రాల కొనుగోలును సచివాలయంలో మంగళవారం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ఇందుకోసం అమెజాన్‌తో ఆప్కో ఒప్పందం చేసుకుందన్నారు. ఇకపై ఆప్కో, అమెజాన్‌ సంస్థలు కలిసి పనిచేస్తాయని, అమెజాన్‌ సహాయంతో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ జరుగుతోందన్నారు. ఆప్కో నుంచి 104 రకాల చేనేత ఉత్పత్తులు అమెజాన్ విఫణిలో అందుబాటులో ఉండనున్నాయన్నారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన సమీక్షలో చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తృత పరచాలని సూచించారని, ఈ నేపధ్యంలో చేనేత, జౌళి శాఖ సంచాలకకులు హిమాన్హు శుక్లా దీనిపై అధ్యయనం చేసి అమెజాన్ తో ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో ఆప్కో ఉత్పత్తులను అమెజాన్ ఈ మార్కెటింగ్ చేస్తుందని, దశల వారిగా అంతర్జాతీయ విపణిలో చేర్చుతుందని మంత్రి పేర్కోన్నారు.  త్వరలో లేపాక్షి ఉత్పత్తులను కూడా విశ్వ విఫణిలో చేర్చుతామన్నారు.
 
అమెజాన్ తన కమీషన్ ను సైతం తగ్గించుకుని 8శాతానికే పరిమితం అయ్యిందన్నారు. 120 ఆప్కో షోరూమ్ లద్వారా 200 మిలియన్ వినియోగ దారులను చేరుతున్నామని, భవిష్యత్తులో ఒక బిలియన్ వినియోగదారులను చేరుతామని అంచనా వేస్తున్నామన్నారు. అమెజాన్ గిడ్డంగికి ఇప్పటికే పదివేలకు పైగా ఉత్పత్తులు  చేరాయన్నారు. మంత్రి స్వయంగా తన సతీమణి కోసం పట్టు చీరను కోనుగోలు చేసి కొనుగోలు దారులకు ఆదర్శంగా నిలిచారు.
 
ఈ సందర్భంగా చేనేత, జౌళి శాఖ సంచాలకులు హిమాన్హు శుక్లా మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన చేనేత వస్త్రాలను ఈ కామర్స్ ద్వారా పొందగలుగుతారన్నారు. మరోవైపు చేనేత పనివారు అధిక విక్రయములను సాధించగలుగుతారన్నారు. నాణ్యమైన ఆప్కో చేనేత వస్త్రములు అందరికి అందుబాటులోకి తీసుకోని వచ్చి తద్వారా ఆప్కో ఇమేజ్ పెంపొందించటమే కాక, చేనేత కార్మికులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయటం సాధ్యమవుతుందన్నారు. 
 
విక్రయాభివృధి ద్వారా ఆదాయ వనరులు పెంచుకుని ఆప్కో స్వయం సంవృద్ధి సాధించగలుగుతుందని, ఎటువంటి మోసాలను తావు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు అందుబాటులోకి వస్తామని, సిల్క్ మార్క్, హ్యాండ్ లూమ్ మార్కుతో ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు.  ప్రభుత్వ రంగ సంస్థలకు అమెజాన్‌లో ప్రత్యేకంగా కేటాయించబడిన కారిగార్ స్టోర్ ద్వారా ఆప్కో ఉత్పత్తుల యొక్క పూర్తి వివరములు అందుబాటులో ఉంటాయని హిమాన్హు శుక్లా తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపి సంజీవ్ కుమార్, చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, అప్కో జిఎంలు రమేష్ బాబు, సుదర్శనరావు, అమెజాన్ ప్రతినిధులు అదిత్య, నూరుల్ తదితరులు పాల్గొన్నారు.