గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 9 జులై 2021 (14:18 IST)

పాక్ ఉగ్ర‌వాద కాల్పుల్లో బాప‌ట్ల జ‌వాన్ మృతి, జ‌వాన్ కుటుంబానికి సీఎం జ‌గ‌న్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా

పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్ లు మృతి చెందారు. అందులో ఒక‌రు గుంటూరు జిల్లా బాప‌ట్ల‌కు చెందిన జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డి కావడంతో కొత్త‌పాలెంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.
 
భారతదేశ సరిహద్దులు లోని జమ్మూకాశ్మీర్ రాజోరీ జిల్లాలోని సుందర్ బాని సెక్టార్లో రెండు రోజులుగా జ‌రుగుతున్న కాల్పుల్లో బాపట్ల వాసి దరివాదా కొత్తపాలెంకు చెందిన యువకుడు మారుప్రోలు జశ్వంత్ రెడ్డి (23) అసువులు బాశాడు.
 
జశ్వంత్ రెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మలు కుమారుడి  వీర మరణంతో దుఃఖసాగ‌రంలో మునిగిపోయారు. కొడుకు పెళ్ళి శుభ‌కార్యం జ‌రిగి, ఇంట్లో సంతోషకరమైన సందడి జరిగి నెల రోజులు కాకుండానే ఈ విషాదం జ‌ర‌గ‌డంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్మీ  లాంఛనాలతో  శుక్రవారం సాయంత్రానికి మృతదేహం బాపట్ల చేరుకోవచ్చునని భావిస్తున్నారు.
 
జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డి కుటుంబానికి సీఎం జ‌గ‌న్ ఎక్స్ గ్రేషియా
ఉగ్రవాదులపై పోరులో కశ్మీర్‌లో ప్రాణ త్యాగం చేసిన అమ‌ర జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డి కుటుంబానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని సీఎం వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనద‌న్నారు.
 
మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం తెలియగానే ఈ విధంగా స్పందించారు.