శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:53 IST)

బెజ‌వాడ‌లో ఫోర్జ‌రీ సంత‌కాల‌తో భోగ‌వ‌ల్లి ట్ర‌స్ట్ ఆస్తుల అన్యాక్రాంతం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ అండ‌తో ఆయ‌న‌ కోట‌రీ వ్య‌క్తులు ఫోర్జ‌రీ సంత‌కాల‌తో దేముడి మాన్యాల‌ను, ట్ర‌స్టుల‌ను కొల్ల‌గొట్టాల‌ని చూస్తున్నార‌ని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట్ మహేష్ ఆరోపించారు. విజ‌య‌వాడ వ‌న్ టౌన్ లోని భోగవల్లి సత్రం ట్రస్ట్ ఆస్తుల‌ను దొంగ సంత‌కాల‌తో ఆక్ర‌మించాల‌ని య‌త్నిస్తున్నార‌ని పేర్కొన్నారు. భోగవల్లి సత్రం ట్రస్ట్ ఛైర్మ‌న్ పేరిట ఫోర్జరీ సంతకంతో ఫేక్ ప్రెస్ రిలీజ్ చేశార‌ని పోతిన మ‌హేష్ చెప్పారు.
 
ఇలా సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట్ మహేష్ డిమాండు చేశారు. మంళవారం ఆయ‌న జ‌న‌సేన కార్యాల‌యంలో ఈ ఫోర్జరీ సంతకంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫేక్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన 420  ఎవరో పోలీసు శాఖ వారు విచారణ చేపట్టాల‌ని డిమాండు చేశారు. 
 
ఇలాంటి దొంగ సంతకాలతో 18 కోట్ల విలువైన ఆస్తులు కొట్టేసే ప్రయత్నం జ‌రుగుతోంద‌ని, మంత్రి వెల్లంపల్లి కోటరీ నేటికీ ఇలాంటి ప్ర‌య‌త్నాల‌ను కొనసాగిస్తున్నార‌ని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో దేవాదాయ శాఖ ఆస్తులు సంపాదించాలని చూసే వారిపై పోలీస్ శాఖ విచారణ చేపట్టాల‌ని డిమాండు చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌ని పోతిన మ‌హేష్ చెప్పారు.