సొంతవాళ్లు కూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీ నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అందువల్ల వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చని తెలిపారు. ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగిపోయిందని చెప్పారు. ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణాలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్టు రాజాసింగ్ చెప్పారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
జంట నగరాల్లో రాజా సింగ్‌కు బీజేపీ శ్రేణుల్లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే, గత యేడాడి ఆయన మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. దీంతో బీజేపీ పెద్దలు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి తొలగించింది. శాసనసభాపక్ష నేతల పదవి నుంచి తప్పించింది. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజా సింగ్ తాజాగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.