శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మార్చి 2024 (14:39 IST)

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా - ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖాయమా?

andhrapradesh map
సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి అభ్యర్థలు జాబితాను ప్రకటించింది. మొత్తం 195 మంది అభ్యర్థులతో ఈ జాబితా ఉంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కేంద్ర మంత్రుల్లో 34 మంది మళ్లీ టిక్కెట్ దక్కించుకున్నారు. 
 
ఈ తొలి జాబితాలో వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించలేదు. ఏపీలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొని ఉండడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. 
 
జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అదేసమయంలో టీడీపీ - జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులోకి బీజేపీ వస్తుందా? రాదా? అనే అంశం ఇప్పటిదాకా అనిశ్చితి సృష్టించింది. ఇప్పుడు తొలి జాబితాలో ఏపీ అభ్యర్థులను ప్రకటించకపోవడం చూస్తుంటే... టీడీపీ - జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంపై బీజేపీ వేచి చూసే ధోరణి కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది.
 
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరయ్యారు. పొత్తులపై ఆయన రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అదేసమయంలో, ఏపీలో పొత్తు లేకుండా ఒంటరిగా ముందుకు వెళ్లడంపైనా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు నేతలు పొత్తు లేకపోతే గెలిచే అవకాశాలు లేవని చెప్పగా, మరికొందరు నేతలు ఒంటరిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. 
 
నేటి సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏపీలో పొత్తుపై బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఏపీలో లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు అర్థమవుతోంది. టీడీపీ, జనసేనలతో చర్చించి సీట్ల సర్దుబాటు చేసుకుని, ఆ తర్వాతే ఏపీ అభ్యర్థుల జాబితా ప్రకటించాలన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది.
 
ఇప్పటికే టీడీపీ - జనసేన సీట్ల పంపకంపై ఓ ప్రకటన చేశాయి. పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉండగా, ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే... టీడీపీ ఎన్ని స్థానాలు తీసుకుంటుంది? బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, రెండో జాబితాలో జనసేనకు మరికొన్ని ఎంపీ స్థానాలు ఇస్తారా? అనే దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.