శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (16:06 IST)

ఎన్నైనా అనుకోండి... 3 రాజధానులపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : బొత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణపై ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాడేపల్లిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పారు. 
 
ఈ విషయంలో ఎవరెన్ని అనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా రాజధానుల అంశంలో వెనక్కి తగ్గేదే లేదని బొత్స స్పష్టం చేశారు. మూడు రాజధానులపై రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు. రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని, అది ఏ నిమిషాన అయినా అమలు కావొచ్చని అన్నారు.
 
ఓ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పనిచేయవచ్చన్నారు.  కోర్టులో ఉన్న కేసులకు, ముఖ్యమంత్రి పనిచేయడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బొత్స వివరించారు.
 
మరోవైపు, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా త్రీ క్యాపిటల్స్‌పై స్పందించారు. పరిపాలనా రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందన్నారు. సీఆర్డీఏ చట్టానికి, మూడు రాజధానులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఎప్పుడు అవుతుందనే విషయంలో డేట్ మాత్రం అడగొద్దని విజయసాయి చెప్పారు. 
 
మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఆయన అన్నారు. విశాఖలో కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్ వేస్తామని, ముడుసర్లోవ పార్కుని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పాలన సాగించవచ్చని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
మరోవైపు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రంగువెలిసిన పార్టీలో ఉత్తేజం నింపాలంటే కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమైన కార్యాచరణను ఇవ్వాలని, ప్రజలతో మమేకమై వారి అభిమానాన్ని చూరగొనాలని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఏ కులాన్ని ఎలా మేనేజ్ చేయాలి, విద్వేషాలను రెచ్చగొట్టి సామరస్యాన్ని ఎలా దెబ్బతీయాలనే కాలం చెల్లిన వ్యూహాలకే పదును పెడుతున్నారని ఎద్దేవా చేశారు.