బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (16:45 IST)

'ఉక్కు ప్రైవేటీకరణ'కు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం : మంత్రి బొత్స

విశాఖ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావించే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. అధికార పార్టీ కూడా ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 
 
ఈ క్రమంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్నది వాస్తవమేనని తెలిపారు. 
 
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించారు.
 
స్టీల్ ప్లాంట్ అనేది ఒక్క విశాఖపట్నానికో, విజయనగరానికో, శ్రీకాకుళానికి పరిమితమైన అంశం కాదని, ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి చెందిన అంశమని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల సెంటిమెంట్లకు సంబంధించిన విషయమని అన్నారు. 
 
దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేది తమ అభిప్రాయమని, దీన్ని అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదు, ఏంచేస్తే ప్రైవేటీకరణ ఆగుతుందో అంతవరకు వెళ్లడానికి తాము సిద్ధమేనని బొత్స ఉద్ఘాటించారు.