సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (15:21 IST)

చిత్తూరును గంజాయివనంగా మార్చిన మంత్రి పెద్దిరెడ్డి : పంచుమర్తి అనురాధ

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాను గంజాయివనంగా మార్చారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తులసివనం లాంటి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కలుపుమొక్క అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరును పెద్దిరెడ్డి గంజాయివనంగా మార్చారని విమర్శించారు. 
 
పంచాయతీ ఎన్నికల్ని ఎదుర్కొనే సత్తా పెద్దిరెడ్డికి లేదన్న ఆమె, టీడీపీ హయాంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులేస్తారా? అని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉండి మహిళలను ఉద్దేశించి పెద్దిరెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
అలాగే, మరో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ, ప్రజాబలం ఎదుర్కోలేక వందలమంది పోలీసులతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చెయ్యడం ప్రభుత్వ దుర్మార్గ చర్య అని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అచ్చెన్నపై కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించక తప్పదన్నారు. 
 
‘‘ప్రజాబలం ఎదుర్కోలేక వందలమంది పోలీసులతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చెయ్యడం ప్రభుత్వ దుర్మార్గ చర్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో భయబ్రాంతులకు గురి చేయాలనే ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డారు. అచ్చెన్నపై కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించక తప్పదు’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.