ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (15:37 IST)

వదలని వర్షాలు.. మళ్ళీ బుడమేరుకు వరద పెరిగే అవకాశం

Budameru
Budameru
ఏపీ ప్రజలను వర్షాలు భయపెట్టేస్తున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతాలను వర్షాలు వదిలిపెట్టట్లేదు. భీమవరం, ఉండి పరిసర ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది.
 
ఏజెన్సీలో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాలలో సైతం కొండ వాగులు పొంగుతున్నాయి. 
 
అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు అంగన్వాడి సెంటర్లకు, కాలేజీలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.
 
ఇక విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మళ్ళీ తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే వర్షాల కారణంగా విజయవాడ పూర్తిగా అతలాకుతలమైంది. 
 
ఈ నేపథ్యంతో మళ్లీ వర్షం కురుస్తోందంటేనే విజయవాడ వాసులకు వెన్నులో వణుకు పుడుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు జడుసుకుంటున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. బాపట్ల జిల్లా కృష్ణా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి.  
 
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి మైలవరం ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. 
 
మళ్ళీ బుడమేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న మైలవరం, జి.కొండూరు మండలాల్లోని బుడమేరుపై వంతెనలు నిర్మించారు.