ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (08:47 IST)

అమ్మో... ఆర్థిక శాఖ... బెంబేలెత్తుతున్న బుగ్గన

ఆర్దికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరుంది. అందుకే ఆయనను ప్రాధాన్యత గల ఆర్దిక శాఖకు మంత్రిని చేశారు.

'ఏ ప్రభుత్వంలో అయినా ఆర్దిక శాఖ మంత్రి అంటే అందరూ ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తారు. ఆర్దిక శాఖమంత్రి అయ్యాను… మిగతా మంత్రుల కన్నా నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు… నేనంటే జగన్‌కు అభిమానం, నమ్మకం' అని బుగ్గన పొంగిపోయారు.
 
 మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బుగ్గనకు ఆ శాఖ పరిస్థితి ఏమిటో అనుభవంతో తెలిసి వచ్చింది.. ఒక వైపు నిధుల కొరత… మరో వైపు సమర్ధులైన అధికారులు ఆర్దిక శాఖలో లేకపోవటం. మంత్రి గారు మా శాఖకు నిధులు ఇవ్వండి అని ఏ మంత్రి అయినా అడిగితే బుగ్గన చేతులెత్తేస్తున్నారు.

ఇటీవల ఆర్దిక మంత్రి రాజేంద్రనాద్‌ రెడ్డి కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతూ నా మంత్రి పదవి అయినా తీసేయ్యమని, లేదా శాఖను అయినా మార్చండి అని జగన్‌ను అడుగుతా.

ఆరెండిటిలో ఏది చేసిన నాకు సంతోషం అని చెప్పారట. మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పలేక, వాస్తవ పరిస్థితులను బయటకు చెప్పలేక బుగ్గన నరక యాతన పడుతున్నారట.
 
ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చినా చాలు.. ఆర్దిక శాఖ నాకొద్దు అని బుగ్గన మొత్తుకుంటున్నారంటే ఆ శాఖలో అధికారుల పనితీరు, నిధుల కొరత ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వచ్చే అసెంబ్లీలో బడ్జెట్‌ను తాను ప్రవేశ పెడతాను అనే నమ్మకం తనకు లేదని బుగ్గన చెబుతున్నారంటే ఆయన మంత్రి పదవిని వదులుకునేందుకు మానసికంగా సిద్దపడ్డారన్న విషయం స్పష్టమవుతోంది అంటున్నారు. జగన్‌ను బుగ్గన కలిసి మంత్రి పదవి నుండి తప్పిచండి లేదా శాఖను అయినా మార్చండి అని అడిగారా లేదా త్వరలో కోరతారా అనే విషయం బయట పడటం లేదు.
 
ఆర్ధిక శాఖ అధికారులతో తలనొప్పి, సహచర మంత్రులు చేసిన సిఫార్సులను అమలు చేయలేరు, నిధులు కావాలని అడుగుతున్న ఎమ్మెల్యేలను సంతృప్తి పరచలేరు. ఈ శాఖ మంత్రిగా ఉంటూ అందరిలో వ్యతిరేకత కొని తెచ్చుకునే కన్నా ఎమ్మెల్యేగా కాలం గడపటమే మిన్నగా బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి భావిస్తున్నారేమో.

డిసెంబరు లో అధికారులతో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించి ఏ శాఖకు ఎన్ని నిధులు కావాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆర్దికమంత్రిపై ఉంటుంది. ఈ శాఖ నాకొద్దు అంటున్న బుగ్గన కోరికను జగన్‌ నెరవేరుస్తారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే.