శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 మే 2020 (21:13 IST)

ఎపిలో 18 నుంచి బ‌స్సు స‌ర్వీస్ లు?

దేశ వ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదితో ముగియ‌నుంది.. దీంతో 18వ తేది నుంచి కేంద్రం రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఎపిలో ఆర్టీసీ బస్సులు న‌డిపేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ది యాజ‌మాన్యం.

ఈ క్ర‌మంలోనే ఏపీ ఎస్ ఆర్టీసీ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగా నగదు ర‌హిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు..అందుకోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. బ‌స్సుల‌ను అంత‌ర్ జిల్లా స‌ర్వీస్ లుగానే న‌డ‌పాల‌ని భావిస్తున్నారు.

ఎపిలో మాత్ర‌మే బ‌స్సులు తిర‌గ‌నున్నాయి..బ‌స్సుల‌లో 50 శాతం సీట్ల‌లో మాత్ర‌మే ప్ర‌యాణీకుల‌ను అనుమ‌తిస్తారు..సిటీ బ‌స్సుల‌కు సైతం ఇదే నిబంధ‌న వ‌ర్తింప చేయ‌నున్నారు. ఇక కరోనా నేప‌థ్యంలో కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించింది.

బస్సులో ప్రయాణికుల మధ్య తిరుగుతూ కండక్టర్లు బ‌స్‌టిక్కెట్లు ఇస్తే కరోనా వ్యాప్తికి అవకాశం ఉంటుందని భావించిన అధికారులు ప్రయాణికులు ఆన్‌లైన్‌లో, కరెంట్‌ రిజర్వేషన్‌, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొని బస్సు ఎక్కాల్సి ఉంటుంది.

ఇక, నాన్‌ ఏసీ బస్సుల విషయానికి వస్తే 150 కి.మీ.కుపైన దూరం వెళ్లే బస్సులకు 5 స్టాప్‌లు మాత్రమే ఉండాలి. అది కూడా ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. ఇక 150 కిలోమీటర్ల లోపు బస్సు సర్వీసులు అయితే ఆర్టీసీ నిర్దేశించిన కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవాలి. నాన్ స్టాప్ బస్సులకు కూడా ఇక ఆన్‌లైన్ రిజర్వేషన్లు ఉంటాయి.

పల్లె వెలుగు బస్సుల‌కు సంబంధించి కూడా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. ప్రయాణికులు బస్టాండ్‌లు, ఆర్టీసీ సిబ్బంది, బుకింగ్ ఏజెంట్ల దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. బస్టాండుల్లో టిక్కెట్ల కోసం గ్రౌండ్ బుకింగ్ సాప్ట్‌వేర్‌తో టిమ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తారు.

సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు లేకుండా కొన్ని స్టాపుల్లో టిక్కెట్లు తీసుకోవాలి. బస్సుల డోర్లకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల‌ని అన్ని డిపోల మేనేజ‌ర్ల‌కు స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.