ఇకపై సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు యేడాదికి రెండుసార్లు!
కొత్త విద్యా సంవత్సరం (2026-27) నుంచి సీబీఎస్ఈలో యేడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి పరీక్షలు యేడాదిలో రెండుసార్లు నిర్వహించేందుకు సీబీఎస్ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం ముసాయిదా నిబంధనలతో పబ్లిక్ నోటీసును విడుదల చేసింది.
ఫిబ్రవరి - మార్చి నెలలో మొదటి విడత పరీక్షలు, మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్టు అందులో పేర్కొది. ఈ రెండు పరీక్షలు కూడా పూర్తిస్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని ముసాయిదాలో స్పష్టం చేసింది. వీటిపై మార్చి 9వ తేదీలోగా అభిప్రాయాలను వెల్లడించాలని కోరింది.
ప్రజలు వెల్లడించే తమ అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత ముసాయిదాను సమీక్షించి, సవరించి తుది రూపు ఇచ్చి ఖరారు చేయనున్నట్టు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సన్యమ్ భరద్వాజ్ వెల్లడించారు. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు మార్పులకు కేంద్రం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ పరీక్షా విధానంలోనూ ఈ మార్పులు చేపడుతుంది.
ఈ బోర్డు పరీక్షలను యేడాదిలో రెండుసార్లు నిర్వహించినప్పటికీ ప్రాక్టికల్స్, అంతర్గత మూల్యాంకన మాత్రం ఒకేసారి చేయనున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. ఈ తరహా విధానం వల్ల విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖామంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్టు మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.