మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (09:53 IST)

హోం వర్క్ చేయలేదని విద్యార్థి పన్ను విరగ్గొట్టిన టీచర్.. ఎక్కడ?

hammer - teeth
టెన్త్ క్లాస్ విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి పట్ల కిరాతకంగా నడుచుకున్నాడు. పట్టరాని కోపంతో విద్యార్థిపై దాడి చేశాడు. దీంతో ఆ విద్యార్థి దంతం ఒకటి (పన్ను) విరిగిపోయింది. పైగా, ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలు తాళలేక ఆ విద్యార్థి తరగతి గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ విద్యార్థికి వేసవి సెలవులకు ముందు ఒక ఉపాధ్యాయుడు ఏప్రిల్ నెలలో హోం వర్క్ ఇచ్చాడు. అయితే, వేసవి సెలవుల్లో సదరు విద్యార్థి పూర్తి చేయకుండా స్కూలుకు వచ్చాడు. దీంతో హోం వర్క్ ఎందుకు పూర్తి చేయలేదని ఉపాధ్యాయుడు ప్రశ్నించగా, వ్యక్తిగత కారణాల వల్ల చేయలేకపోయానంటూ విద్యార్థి సమాధానం ఇచ్చాడు. అంతే.. ఆ ఉపాధ్యాయుడుకి ఎక్కడలేని కోపం వచ్చింది. సహనం కోల్పోయిన టీచర్.. విద్యార్థిపై దాడి చేశాడు. 
 
కర్రతో తీవ్రంగా కొట్టడంతో పాటు బలవంతంగా తోసేశాడు. దీంతో విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించిన ఉపాధ్యాయుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ప్రధానోపాధ్యాయుడు... విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందిత ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
విద్యార్థి ముఖం, నోటిపై గాయాలు అయ్యాయని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు సలోన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జేపీ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి స్పందిస్తూ.. తన కొడుకుని దారుణంగా కొట్టారంటూ వాపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లానని, ఒక రోజు చికిత్స అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారని వివరించారు.