ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై తీర్పు రిజర్వు
స్వతంత్రులకే ఎన్నికల కమిషన్ అధికారాలు ఇవ్వాలని, హైకోర్టులో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ పూర్తైంది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ, దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.
నీలం సాహ్నిని ఎస్ఈసీ గా నియమించడాన్నిసవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తిని ఎస్ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.
ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసినందున నీలం సాహ్ని స్వతంత్ర ఎస్ఈసీ కాదని, పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.