చంద్రబాబుకు మానవత్వం లేదు... ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు : సజ్జల
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కొంచెం కూడా మానవత్వం లేదన్నారు. అందుకే ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యవహారశైలిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.
చంద్రబాబు కుప్పం టూర్‌పై ఆయన స్పందిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై సభలను నిర్వహించడం సరికాదన్నారు. పైగా, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 1 పోలీస్ చట్టానికి లోబడే ఉందన్నారు. ఈ జీవోను పట్టించుకోబోమని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదన్నారు.
చంద్రబాబు చేపట్టిన కుప్పం యాత్ర ప్రభుత్వంపై దండయాత్రలా మారిందన్నారు. చంద్రబాబు ఒక ఉన్మాదిలా మారారని ఆరోపించారు. కందుకూరు, గుంటూరుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుకు కనీస మానవత్వం కూడా లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.