జగన్ పాలనను పశుపక్ష్యాదులు సైతం ఇష్టపడటం లేదు : జేసీ ప్రభాకర్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా, సైకోలా మారిపోయి పాలన సాగిస్తున్నారని, ఆయన పాలనను పశుపక్ష్యాదులు సైతం ఇష్టపడటం లేదని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడే హక్కును కోల్పోయారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్వాతంత్ర్య పోరాటం నాటి విపత్కర పరిస్థితులు నెలకొనివున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వచ్చే మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని లోకల్ ఛానెల్స్, టీవీ చానెళ్లు, పత్రికలపై అనేక రకాలైన తీవ్ర ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అదేసమయంలో రోజురోజుకూ వైకాపా కార్యకర్తల జోరు తగ్గిపోతుందన్నారు. కానీ, పోలీసులు మాత్రం వైకాపా కార్యకర్తల కంటే అధిక స్థాయిలో రెచ్చిపోతున్నారని ఆరోపించారు. చివరకు చెత్క బండ్లను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని, భవిష్యత్తులో పోలీసులే వీధుల్లోని చెత్తను ఎత్తివేస్తారేమో అని ఎద్దేవా చేశారు.
ఒక ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో తిరిగే స్వేచ్ఛ కూడా లేదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే పరిస్థితి చాలా బాధ కలిగిందన్నారు. ప్రజలను రక్షించడానికే చంద్రబాబు అవస్థ పడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు.