సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జనవరి 2024 (15:11 IST)

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

ys sharmila
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం అధికారికంగా వెల్లడించింది. 
 
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వెతెపా) స్థాపించిన షర్మిల.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏపీ పీసీసీ చీఫ్‌ బాధ్యతలను ఆమెకు కట్టబెట్టింది. 
 
ఏపీలో తెలిసో తెలియకో ఓ పిచ్చిమొక్కను నాటాం ... 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల క్రితం తెలిసో తేలియకో ఓ పిచ్చి మొక్కను నాటామని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే విజ్ఞతతో ఓ మంచి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెనాలిలో దివంగత నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు నివాసంలో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన అల్పాహారం చేశారు. 
 
ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమది రాజకీయ భేటీ కాదన్నారు. కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమేనని చెప్పారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయం భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలు చూసుకుంటారని చెప్పారు. 
 
రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. కరెంటు, పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెంచిన ప్రభుత్వం.. రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు తమవంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.