సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 12 ఆగస్టు 2021 (11:11 IST)

కానిస్టేబుల్ భార్య వివాహేత‌ర సంబంధం... హ‌త్య‌!

రత్నాలు లాంటి పిల్లలు.. సమాజంలో ఉన్నత గౌరం ఉన్నా.. కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వారి కోరికలు ఎన్నో అనార్థాలకు దారి తీస్తోంది.

మనుషుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటోంది. విజయవాడలోని పటమట స్టేషన్‌ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లోని పుట్ట రోడ్డులో అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో ఉంటున్నాడు. అదే ఇంటిపైన పెంట్‌ హౌస్‌లో మచిలీపట్నంకు చెందిన 24 ఏళ్ల వెంకటేష్‌ నివాసం ఉండేవాడు. స్థానిక ఆటోనగర్‌లో ఐస్‌క్రీమ్‌ దుకాణం నడిపేవాడు. అయితే కింద ఇంట్లో ఉంటున్న కానిస్టేబుల్‌ భార్యతో వెంకటేష్‌కు పరిచయమైంది. వారిద్దరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

భర్త ఇంట్లో లేని సమయంలో ఇద్దరు కలుస్తూ ఉండేవారు. కొన్నేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా గుట్టుగా వ్యవహారం నడిపించారు. అయితే చుట్టు పక్కల వారి చెప్పిన వివరాలు, భార్య ప్రవర్తనలో మార్పుతో విషయం తెలుసుకున్న శివనాగరాజు తన భార్యను మందలించాడు. తప్పుడు దారిలో వెళ్తున్నావని, బుద్ధిగా నడుచుకోవాలని భార్యను హెచ్చరించాడు. ఈ సంగతిని ఇంటి యజమానులకు చెప్పి వెంకటేష్‌ను ఖాళీ చేయించడంతో మచిలీపట్నం వెళ్లాడు.

అయినా కానిస్టేబుల్ ఉద్యోగ బాధ్యతలపై బటయకు వెళ్తే.. అతడు లేని సమయంలో వెంకటేష్ ఇంటికి వస్తుండేవాడు. దీనిపై ఆరు నెలల క్రితం గొడవ అయ్యింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. పెద్దలు వీరి మధ్య రాజీ కుదిర్చి జూన్‌లో కాపురానికి తిరిగి పంపించారు. అయినా ఆమె వెంకటేష్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేది.. ఈ మంగళవారం పని నిమిత్తం వెంకటేష్‌ నగరానికి వచ్చాడు. అదే రోజు రాత్రి విధులకు శివనాగరాజు వెళ్లిపోయాడు. దీంతో వెంకటేష్‌ బుధవారం తెల్లవారుజామున శివనాగరాజు ఇంటికి వచ్చాడు.

తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో అలికిడి అయి, ఇంటి యజమానులు పైకి వెళ్లి చూడగా వెంకటేష్‌ లోపలికి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఎంత తట్టినా తలుపు తీయకపోయే సరికి, బయట గడియపెట్టి జరిగిన విషయాన్ని రాత్రి విధుల్లో ఉన్న శివనాగరాజుకు తెలిపారు. ఆ ఫోన్ రావడంతో ఆవేశంతో రగిలిపోయిన శివనాగరాజు.. కోపంతో వచ్చి లోపల ఉన్న వెంకటేష్‌ను చేతులు, కాళ్లు కట్టివేసి వంటగదిలోని సామగ్రితో తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని పక్కన ఉన్న వాళ్లు గమనించి డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో పటమట పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

తీవ్ర గాయాలపాలైన వెంకటేష్‌ను వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానిస్టేబుల్‌ శివనాగరాజు, ఇంటి యజమానులు రత్నసాయి, అనూరాధలపై సెక్షన్‌ 302, 342 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ సురేష్‌ రెడ్డి తెలిపారు. అయితే నిందితుడు ఏపీ డీజీపీ వ్యక్తిగత బాడీగార్డ్ కావడం సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అతడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.