మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (16:00 IST)

తెలంగాణాలో 14 గంటలు కాదు... 24 గంటల జనతా కర్ఫ్యూ : కేసీఆర్

కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇందులోభాగంగా, ప్రధాని మోడీ పిలుపు మేరకు 14 గంటల కాద 24 గంటల పాటు జనతా కర్ఫ్యూను పాటించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 
 
ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 21 కరోనా కేసులు నమోదయ్యాయని, వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా అనుమానితులపై నిఘా కోసం తెలంగాణ చుట్టూ 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. 78 సంయుక్త కార్యాచరణ బృందాలను కూడా మోహరించామన్నారు. 
 
విదేశాల నుంచి వచ్చిన వారికి చేతులెత్తి దండం పెడుతున్నానని, దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా సమాజం మొత్తం వ్యాధిగ్రస్తమయ్యే ప్రమాదం వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో స్వయంనియంత్రణ అవసరమన్నారు. అలా ముందుకు వచ్చినవారి కోసం అంబులెన్స్ నుంచి మాత్రల వరకు ప్రభుత్వమే అన్నీ భరిస్తుందని హామీ ఇచ్చారు. లేనిపక్షంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 
పరిస్థితి తీవ్రత కారణంగా తాము మీడియా సమావేశంలో విలేకరులను కూడా మూడు మీటర్ల ఎడంతో కూర్చోబెట్టామని, అందరి క్షేమం దృష్ట్యా ఇలాంటి చర్యలు తప్పడంలేదని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని, ఆయన 14 గంటలు పాటిద్దాం అని చెప్పారని, కానీ తెలంగాణ వాసులు రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించి సామాజిక బాధ్యతను చాటాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
 
ఈ జనతా కర్ఫ్యూను సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షాప్స్, మాల్స్ అన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఇది తమ ఆదేశం కాదని... ఎవరికి వారు నిర్ణయం తీసుకుని మూసివేయాలని చెప్పారు. నిత్యావసరాలు, చేపలు, పండ్లు, కాయగూరలు అమ్ముకునే వారిపట్ల ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. 
 
ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరం ముందుకు రావాలని చెప్పారు. తెలంగాణను కరోనా ఏమీ చేయలేపోయిందనే గొప్ప పేరును తెచ్చుకుందామని అన్నారు.
 
విదేశాల నుంచి వచ్చినవారు క్వారంటైన్ నుంచి పారిపోతుండటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారంటైన్ నుంచి ఎందుకు పారిపోవాలని ప్రశ్నించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్యులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. మీకు వ్యాధి లక్షణాలు ఉంటేనే ఐసొలేషన్‌కు తరలిస్తారని తెలిపారు.