శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (11:25 IST)

కనికా కపూర్ నిర్లక్ష్యం : వణికిపోతున్న బ్యాంకు సిబ్బంది

కరోనా వైరస్ ఫీవర్ కారణంగా ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా, ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. పలు ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే, బ్యాంకు సిబ్బంది పరిస్థితి మాత్రం క్లిష్టంగా మారింది. బ్యాంకు సిబ్బంది ఖచ్చితంగా బ్యాంకులకు వచ్చి పనిచేయాల్సివుంటుంది. ఈ భయమే వారిని వెంటాడుతోంది. 
 
బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ వహించిన నిర్లక్ష్యం దేశాన్ని భయపెట్టిస్తోంది. ఇప్పటికే కనికా కపూర్‌తో దగ్గరగా తిరిగిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే రెండు రోజుల క్రితం లక్నోలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (లాతూష్‌ రెడ్‌ బ్రాంచ్‌) మేనేజర్‌ మనోజ్‌ కుమార్‌.. కనికాను ఆమె నివాసంలో కలిశారు. సుమారు అర్థగంట పాటు ఆమెతో మాట్లాడారు. 
 
తనకు కరోనా సోకిందని కనికా ప్రకటించడంతో బ్యాంకు ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. మనోజ్‌తో పాటు బ్యాంకు ఉద్యోగులకు కరోనా సోకి ఉండొచ్చనే అనుమానం వారిలో మొదలైంది. స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని మనోజ్‌ను మిగతా ఉద్యోగులు కోరినప్పటికీ ఆయన తిరస్కరించారు. 
 
‘బేబీ డాల్‌' సింగర్‌గా పేరున్న కనికాకపూర్‌ (41) ఈ నెల 10న లండన్‌ నుంచి ముంబైకి విమానంలో వచ్చారు. మరుసటి రోజు విమానంలో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చేరుకున్నారు. అక్కడే ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన దావత్‌కు హాజరయ్యారు. ఇదే పార్టీలో రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. 
 
నాలుగు రోజుల తర్వాత జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో కనికాకపూర్‌ వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలో కరోనా పాజిటివ్‌ అని వచ్చిందని, తాను నిర్బంధంలోకి వెళ్తున్నానని ఆమె శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు లక్నోలోని సంజయ్‌ గాంధీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. 
 
తన కూతురు ఈ నెల 13, 14, 15వ తేదీల్లో వరుసగా మూడు దావత్‌లకు హాజరయ్యిందని, 250-300 మందిని ఆమె కలుసుకొన్నట్టు కనిక తండ్రి రాజీవ్‌ కపూర్‌ తెలిపారు. ఇది మరింత భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ఆమె ఎవరెవరిని కలిశారో వారందరి వివరాలను సేకరించే పనిలో యూపీ పోలీసులు ఉన్నారు.