మోడీ ఆదేశిస్తాడు... జగన్మోహన్ రెడ్డి పాటిస్తాడు...
ట్రూ అప్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలను వినియోగదారులపై మోపడాన్ని సిపిఐ ఖండిస్తోంది. ఇది కేంద్రం కుట్ర అని, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని విమర్శించింది. విజయవాడలోని గుణదలలోని విద్యుత్ సౌదా కార్యాలయం ఎదురుగా జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కరెంటు ఛార్జీలకు నిరసనగా, కరెంటు బిల్లులను సిపిఐ నాయకులు దహనం చేశారు. కేంద్రం నుంచి ప్రధాని మోడీ ఆదేశిస్తారని, ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి దానిని పాటిస్తాడని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు.
ఏపీ సీఎం అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పాలనను విస్మరించి, వ్యాపారాలపై దృష్టి పెట్టారని ఆరోపించారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై మోపిన రూ. 3966/- కోట్ల బకాయిలను వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. అసలు ట్రూ అప్ ఛార్జీల పేరిట కరోనా సమయంలో ప్రజలపై భారాన్ని ఎందుకు మోపాలని ఆయన ప్రశ్నించారు. దీనిని కేంద్రమే భరించాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలన్నారు. అలా భరించలేని పక్షంలో కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని సూచించారు.