బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:14 IST)

నాడు చంద్ర‌బాబు మత్స్యకారుల బట్టలూడదీస్తానంటే...

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటూ, వారికి మరింత మేలు చేకూరేలా నిర్ణయాలు చేస్తుంటే, టీడీపీ-బీజేపీ నేతలు ఉరి అంటూ, గోబెల్స్ తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులతో  పాటు యావత్తు  బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు.ఇంతకాలం మత్స్యకార సొసైటీ సభ్యులకు కేవలం వెయ్యి రూపాయలు ఆదాయం మాత్రమే ఉన్న చెరువులకు సంబంధించి, మత్స్యకారుల ఆదాయం రూ. 15 వేల వరకు పెరిగేలా నిర్ణయం తీసుకుంటే, ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు. వంద హెక్టార్లు, ఆ పైన ఉన్న చెరువుల నిర్వహణ పేరుకు మాత్రమే మత్స్యకార సొసైటీల పరిధిలో ఉంటుందని, పెత్తనం అంతా దళారులదేనని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 217 జీవో ద్వారా, నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 27 చెరువులను బహిరంగ వేలం ద్వారా ఇస్తే ప్రతిపక్షాలు ఎందుకు రగడ సృష్టిస్తున్నాయని ప్రశ్నించారు. అంటే, ప్రతిపక్షాలు మత్స్యకారులకు అనుకూలమా.. లేక వ్యతిరేకమా అని మోపిదేవి సూటిగా ప్రశ్నించారు.
 
చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు మరికొంతమంది పెద్దలు ఈ విధానం ద్వారా మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని పదేపదే అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ, మత్స్యకారుల గొంతుకు ఉరి బిగించేలా ఉందంటూ ఏవేవో పిచ్చి రాతలు రాశారు. మత్స్యకార సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెడుతున్నఈ పెద్ద మనుషులు, నాడు చంద్రబాబు మత్స్యకార సామాజిక వర్గాన్ని అత్యంత హేయమైన పదాలతో కించపరిచేలా మాట్లాడినప్పుడు ఏమయ్యారు?, ఎందుకు కనీసం ఖండించలేకపోయారు? అని మోపిదేవి ప్ర‌శ్నించారు. 
 
టీడీపీ హామీ ఇచ్చిన విధంగా,  తమకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులు, అంశాలు, డిమాండ్లు సాధించుకోవాడానికి విశాఖపట్నంలో చంద్రబాబును కలిస్తే, వారిని దారుణంగా అవమానపరిచే విధంగా మాట్లాడార‌ని ఆరోపించారు. ‘ఎక్కువ తక్కువగా మాట్లాడితే బట్టలూడదీస్తాను.. తోకలు కత్తిరిస్తా..’ అని చంద్ర‌బాబు అన‌డం మీకు గుర్తు లేదా? అని టీడీపీ నాయ‌కుల‌ను నిల‌దీశారు.